ఏపీ ఎన్నికల సమయంలో ఎన్‌డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒకటి. దాంతో ఈ స్కీమ్ అమలు ఎప్పుడెప్పుడా అని మహిళలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలు తీరుతెన్నుల పరిశీలనకై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రులతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ, హోం శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు అవుతోంది, అక్కడి విధివిధానాలు, ఏపీలో ఎలా అమలు చేస్తే బాగుంటుంది తదితర విషయాలపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా నివేదికను, సూచనలను ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏపీలో ఈ పథకం అమలు కానుంది.