కడప నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం వేళ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సమావేశానికి ముందే కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ పాలక వర్గం, కడప ఎమ్మెల్యే మాధవి మధ్య కుర్చీ వివాదం నడుస్తోంది. గత సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ తనకు కుర్చీ వేయకుండా అవమానించారని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా సమావేశాలకు ముందు కార్పొరేషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. కాగా ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో 8 మంది కార్పోరేటర్లు చేరారు.సోమవారం ఉదయం 11 గంటలకు నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డికి మేయర్ చాంబర్‌లో కూర్చీ వేయలేదు. మేయర్ సురేష్ బాబు, మాధవి రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళను అవమానిస్తారా.. ఇక్కడ కుర్చీ మీరు లాగేసినా ప్రజలు తనకు కుర్చీ ఇచ్చారని, కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే అన్నారు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి తనకుందన్నారు. మేయర్‌కు ఈ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ, కడప నియోజక వర్గంలోని మహిళలను అవమానిస్తే.. వాళ్ల నాయకుడు సంతోషిస్తాడో.. లేకపోతే మేయర్, కార్పొరేటర్ల కుర్చీలు తీసివేస్తారేమో అన్న భయం పట్టుకుందో తెలియదుగానీ కుర్చీలాట మొదలెట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ, మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మేయర్, ఎమ్మెల్యేమాటల యుద్ధం జరిగింది.