నవజాత శిశువులు అంటువ్యాధులు, నీళ్ళ విరోచనాలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడకుండా పుట్టిన గంటలోనే తల్లిపాలు అందజేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంక్‌ను శుక్రవారం జేసీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి రాహుల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు అందించటం ద్వారా 22 శాతం నవజాత శిశువులు మరణాలు నివారించవచ్చు అన్నారు. మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలు 13 శాతం వరకు నివారించవచ్చు అని తెలిపారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రసవానంతరం రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్, అండాశయపు క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, ఎముకల బలహీనత తదితర జబ్బులు నుంచి తల్లికి రక్షణ కలుగుతాయన్నారు. అనంతరం నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీసీ) ఛైర్మన్ డాక్టర్ ఎ.దుర్గాప్రసాద్, సుషేణా హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ కాశీనాథ లక్కరాజు మాట్లాడారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవీ కళ్యాణి పాల్గొన్నారు.