ఏలూరు జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుధ్య కార్మికులు వేతన బకాయిల కోసం ఆందోళన బాట పట్టారు. ఐదు నెలల నుంచి జీతాలు చెల్లించాలని, మూడు రోజుల్లో చెల్లించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ఏపీ మెడికల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శి పి.దత్తాత్రేయ ప్రకటించారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం గంట సేపు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఐదు నెలల నుంచి పారిశుధ్య కార్మికులకు, సెక్యూరిటీ సిబ్బందికి కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ ద్వారా తెలిపినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్నాలో పారిశుధ్య నాయకులు విజయ, జయ, ఝాన్సీ, సెక్యూర్టీ సూపర్‌వైజర్ మైఖేల్‌రాజు పలువురు నాయకత్వం వహించారు.