పాలకొండలోని కార్తికేయ జ్యూయలర్ షాపులో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమదంలో షాపులో ఉన్న బంగారం, వెండి, నగదుతో పాటు ఫర్నీచర్, ఏసీలు, సీలింగ్, ఫ్యాన్లు అగ్నికి ఆహుతైనట్టు యజమాని వారణాసి శేఖర్ తెలిపారు. షాపునకు సంబంధించిన నగదు, బిల్లులు షాపులోనే ఉన్నాయని చెప్పారు. ఆదివారం రాత్రి 9.15 గంటల సమయంలో షాపులో నుంచి పొగలు వస్తున్నట్టు స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక శకటానికి సమాచారం ఇచ్చానని, వారు వచ్చి మంటలను అదుపు చేశారని తెలిపారు.
షాపులో ఉన్న బంగారం, వెండి నగలతో పాటు ఫర్నీచర్ తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయని అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు తెలిపారు. సుమారు రూ.25లక్షలు విలువ చేసే సీలింగ్, ఫర్నీచర్, వేయింగ్ మిషన్లు, ఏసీలు కాలిబూడిదైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. బంగారు, వెండి నగలు వివరాలను ఇన్యూరెన్స్ సిబ్బంది వచ్చి అంచనా వేస్తారని యజమాని తెలిపారు. షార్ట్ సర్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. పాలకొండ సీఐ ఎం.చంద్రమౌళి ఘటనా స్థలాన్ని చేరుకుని, వివరాలు సేకరించారు.