మాజీ IPS అధికారి ఎన్.సంజయ్‌పై ACB కేసు నమోదయ్యింది. గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ చేపట్టింది.గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, CID అడిషనల్ డీజీగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి లభించడంతో సంజయ్‌పై కేసు నమోదైంది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.అనుమతులు లేకుండా అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించినట్లు తెలిపారు. అలాగే సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు అప్పగించి.. పనులు జరగకపోయినా డబ్బు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని పేర్కొన్నారు. ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, తాజాగా ఏసీబీ కేసు నమోదైంది. దీంతో నిధులు ఏమయ్యాయి..? క్రిత్వ్యాప్, సౌత్రికా కంపెనీలకే వెళ్లాయా..? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారించనున్నారు అధికారులు.