కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. సింహాద్రిపురం మండలం దిద్దికుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అప్పుల బాధ తాళలేక అన్నదాత కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన నాగేంద్రకు సొంతంగా ఒకటిన్నర భూమి ఉంది. అయితే సొంత భూమితో పాటు 15 ఎకరాలు వేరే వారి భూములను కౌలుకు తీసుకున్నాడు నాగేంద్ర. పొలాన్ని సాగు చేసేందుకు మితిమీరి అప్పు కూడా చేశాడు. అప్పులు చేసి సాగు చేసిన పంటలో భారీ నష్టం రావడంతో రైతు కృంగిపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయాడు. మరోవైప్పు అప్పు తీర్చే మార్గం లేక.. అప్పులు కట్టాలని ఒత్తిడి ఎక్కువవడంతో మానసికంగా నలిగిపోయాడు. చివరకు తనకు చావే శరణ్యం అని భావించాడు ఆ రైతు.కానీ తాను చనిపోతే తన కుటుంబం ఇబ్బందులు పడుతుందని భావించిన నాగేంద్ర.. భార్య, పిల్లలను కూడా తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించాడు.
ఈ విషయాన్ని భార్యకు చెప్పగా ఆమె కూడా ఎంతో మనోవేదనకు గురైంది. చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. నాగేంద్ర, వాణి దంపతులతో వారి ఇద్దరు పిల్లలకు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా పిల్లలకు ఉరివేసిన తరువాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట చేను గేటుకు ఉరి వేసుకుని అన్నదాత కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నదాత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.