భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్, కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కాంబ్లీకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని మెదడులో రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారించారు. అయితే, ప్రస్తుతం కాంబ్లీ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని సోమవారం వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా అతడు ఆసుపత్రి సిబ్బందితో కలిసి హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ నటించిన చక్ దే ఇండియా మూవీలోని పాటపై కాంబ్లీ స్టెప్పులేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు కాంబ్లీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.