2023 మే నెల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న జాతి హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. గతంలో జరిగిన అన్నింటినీ మర్చిపోతూ ప్రజలు తనను క్షమించాలని కోరారు. ఇంఫాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హింసాకాండను నిర్వహించడంపై ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది చాలా దురదృష్టకరంగా గడిచిందని సీఎం బిరేన్ సింగ్ స్పష్టం చేశారు. గతేడాది మే 3వ తేదీ నుంచి నేటి వరకు జరుగుతున్న హింసాకాండకు ప్రజలకు క్షమాపణ తెలియజేయాలనుకుంటున్నట్లు వివరించారు.
ఈ హింసాకాండ వల్ల అనేక మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని, మరికొందరు తమ ఇళ్లు వదిలిపెట్టి మరీ వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే ఈ అల్లర్లలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. దీనంతటికీ తాను చింతిస్తున్నట్లు సీఎం బిరేన్ సింగ్ వివరించారు. అయితే గత మూడు, నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఓ కొలిక్కి వస్తున్నాయని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
2023 మే 3వ తేదీ నుంచి కుకీ, మైతేయిల మధ్య ఘర్షణలు చెలరేగగా.. ఈ హింసాకాండలో మొత్తం 200 మందికి పైగా చనిపోయినట్లు సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. అలాగే నిరాశ్రయులైన 2 వేల 58 మంది కుటుంబాలను ఇంఫాల్‌లోని పలు ప్రాంతాల్లో పునరావాసం కల్పించినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంట హింసను రికట్టేందుకు NH-2, NH-37 లపై వరుసగా అదనపు భద్రతా సిబ్బందిని ఉంచినట్లు పేర్కొన్నారు. నిరసనకారులు ప్రభుత్వం నుంచి దోచుకున్న 6 వేల ఆయుధాల నుంచి 3 వేల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 625 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు.. మొత్తం 12 వేల 247 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
అంతేకాకుండా మణిపూర్ ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 32 నుంచి 39 శాతానికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రకటించారు. అలాగే వివిధ పథకాల ద్వారా హింసాకాండలో ప్రభావితమైన నిర్వాసితులకు సాయం చేసేందుకు తమ సర్కారు ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. నివాసితులపై ప్రభావం చూపుతున్న అధిక విమాన ఛార్జీలను తగ్గించేందుకు పలు సేవలు ప్రారంభించినట్లు వివరించారు. ముఖ్యంగా విమాన ఛార్జీలు రూ.5 వేలు దాటితే మణిపూర్ ప్రభుత్వం ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తుందని అన్నారు. ఇంఫాల్-గౌహతి, ఇఁఫాల్-కోల్ కతా, ఇంఫాల్-దిమాపూర్ మార్గాల్లో వారానికి రెండుసార్లు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.