ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 15 వరకు వర్చువల్ క్యూ బుకింగ్ ఫుల్.. రోజుకు ఎన్ని వేలంటే

national |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2024, 07:11 PM

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం నుంచి మకరు విళక్కు పూజలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 26న మండల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేసి.. సోమవారం సాయంత్రం తెరిచిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తంత్రి కందారు రాజీవరు ఆధ్వర్యంలో మహాగణపతి హోమంతో మకరవిళక్కు పూజలు షురూ అయ్యాయి. జనవరి 14 వరకు ప్రతి రోజూ 3.30 నుంచి 11 గంటల వరకు నెయ్యి అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 14న మకర జ్యోతి, జనవరి 20న పడిపూజతో మకరు విళక్కు యాత్ర సీజన్ పూర్తవుతుంది.


ఇదిలా ఉండగా, అయ్యప్పస్వామి దర్శనాలకు సంబంధించిన వర్చువల్ క్యూ బుకింగ్ టిక్కెట్లు 15వ తేదీ వరకు పూర్తయినట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. జనవరి 11 వరకు రోజుకు 70,000 వర్చువల్ క్యూ టిక్కెట్లు అందుబాటులో ఉంచామని... ఇవన్నీ కొద్ది గంటల్లోకే హాట్ కేకుల్లా బుక్ అయ్యాయని చెప్పారు. వర్చువల్ క్యూ దర్శనం టిక్కెట్ బుక్ చేసుకోని వారికి స్పాట్ బుకింగ్ ఒక్కటే ఆప్షన్ అని తెలిపారు. అయితే, జనవరి 10 తర్వాత స్పాట్ బుకింగ్ టిక్కెట్లు జారీ నిలిపివేసే అవకాశం ఉంది. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పాట్ బుకింగ్ టోకేన్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.


జనవరి 11న ఎరుమేలిలో పేట తుళ్లై .. జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. ఆయప్ప స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న పొన్నాంబలం మేడుపై మకర సంక్రాంతి రోజు సాయంత్రం మకర జ్యోతి వెలిగిస్తారు. ఆరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత దర్శనాలను నిలిపివేస్తారు. పందళం రాజ వంశీయులు స్వామికి సమర్పించిన తిరువాభరణాలను ఊరేగింపుగా శబరిమలకు తీసుకొస్తారు. వాటిని ఆలయ పూజారులు అయ్యప్పకు అలంకరణ చేస్తారు. ఈ అలంకరణ పూర్తయిన కాసేపటికి మకర నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంది. తర్వాత కొద్దిసేపటికి మకర జ్యోతి మూడుసార్లు దర్శనమిస్తుంది. ఈ జ్యోతిని చూసేందుకు శబరిమలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com