ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ నర్సు ‘ఉరి’కి యెమెన్ అధ్యక్షుడు ఆమోదం.. స్పందించిన భారత్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2024, 07:28 PM

యెమెన్ జాతీయుడి హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి.. ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియా క్షమాభిక్షను ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి తిరస్కించారు. 2017 నుంచి యెమెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిమిష ప్రియాకు హత్య నేరానికి గాను 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ పౌరుడి నుంచి తన పాస్‌పోర్ట్‌‌ను తీసుకునే క్రమంలో అతడికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి ప్రియా హత్యచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులోనే ఆమెను దోషిగా నిర్దారించిన ట్రయల్ కోర్టు.. ఉరిశిక్ష ఖరారు చేసింది. దీనిపై ఆమె అక్కడ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. కింద కోర్టు తీర్పును సమర్దించింది. చివరకు క్షమాభిక్ష కోసం యెమెన్ అధ్యక్షుడికి ప్రియా పెట్టుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురయ్యింది. మరణశిక్షకు ఆమోదం తెలిపిన ఆయన.. అమలకు నెల రోజులు గడువు ఇచ్చినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.


  ఈ పరిణామాలపై కేంద్ర విదేశాంగా శాఖ తాజాగా స్పందించింది. యెమెన్‌లో నిమిష ప్రియా మరణశిక్ష అంశం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ‘‘శిక్ష నుంచి ప్రియాను బయటపడేయటానికి ఆమె కుటుంబం చేస్తున్న ప్రయత్నాలు.. ఆవేదనను మేము అర్థం చేసుకున్నాం... ఈ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. నిమిషా ప్రియాకు ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో యెమెన్ అధ్యక్షుడు నిర్ణయం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.


నిమిషా తల్లి ప్రేమ కుమారి (57) ఈ ఏడాది ఆరంభంలో యెమెన్‌ రాజధాని సనాకు వెళ్లారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించి కేసు రాజీ చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో చర్చల కోసం భారత రాయబార కార్యాలయం నియమించిన లాయర్ అబ్దుల్లా ఆకస్మికంగా తప్పుకున్నారు. అతడికి ఫీజు కింద భారత విదేశాంగ శాఖ ఇప్పటికే 19,871 డాలర్లు (రూ.16 లక్షలు) చెల్లించింది. కానీ, అతడు మాత్రం అదనంగా మరో 40 వేల డాలర్లు రెండు వాయిదాల్లో చెల్లించాలని పట్టుబట్టారు. అతడి ఫీజు మొదటి వాయిదా కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించారు. కానీ, నిధులు వినియోగం విషయంలో పారదర్శకతపై దాతలు సందేహాలు వ్యక్తం చేయడంతో సవాళ్లు ఎదురయ్యాయి.


కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియా ఉపాధి కోసం 2014లో భర్త థామస్, కూతురితో కలిసి యెమెన్‌కు వెళ్లారు. ఆర్ధిక కారణాల వల్ల భర్త థామస్, కూతురు కొద్ది రోజుల్లోనే స్వదేశానికి వచ్చేశారు. ప్రియా మాత్రం అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ.. ఏడాది తర్వాత సొంతంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలని భావించింది. ఇందుకు తన భర్త స్నేహితుడైన తలాల్ అబ్దో మహదీ సహాయం కోరింది. అక్కడ విదేశీయులు ఏదైనా సొంత వ్యాపారం లేదా సంస్థ ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే లైసెన్స్ పొందాలంటే యెమెన్ జాతీయులు హామీ ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆమె తలాల్ సాయం కోరింది.


కానీ, అతడు ప్రియాకు అతడి నుంచి ఎటువంటి సహాయం అందలేదు. దీంతో మరొకరి సాయంతో ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకుంది. సొంతంగా క్లినిక్‌ని ప్రారంభించి ఆమెకు ఆదాయం రావడం ప్రారంభమైన తర్వాత సంపాదనలో కొంత భాగం తనకు కావాలని మహదీ పట్టుబట్టాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాదం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ప్రియా తన భార్య అంటూ తలాల్ నకిలీ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించి, ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో 2016లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన బయటకు వచ్చిన మహదీ.. ప్రియా పాస్‌పోర్టును లాక్కున్నాడు. తన పాస్‌పోర్ట్ ఇచ్చేయాలని ప్రియా పలుమార్లు అడిగినా అతడు ససేమిరా అన్నాడు.


ఈ క్రమంలో 2017లో ఒకరోజు అతడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పాస్‌పార్ట్ లాక్కుంది. ఓవర్‌డోస్ కారణంగా తలాల్ చనిపోగా.. తనకు క్లినిక్ ఏర్పాటుకు సాయపడ్డ యెమనీ అబ్దుల్ హనంతో కలిసి మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్ పడేసింది. ఆ తర్వాత తలాల్ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రియాతో పాటు అబ్దుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. విచారణలో ఇరువురూ తమ నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో యెమెన్ కోర్టు ఆమెకు తొలుత యావజ్జీవిత ఖైదు.. ఆ తర్వాత 2018లో దానిని మరణ శిక్షగా మార్చింది.


దాంతో తన కూతురిని కాపాడుకునేందుకు ప్రియా తల్లి బాధిత కుటుంబంతో మాట్లాడి 'బ్లడ్‌మనీ' (పరిహారం) రూపంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్లు రూ.70లక్షలు డిమాండ్ చేయడంతో కొంత తగ్గించాలని కోరినా తలాల్ కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత యెమెన్‌లోని ఓ భారతీయ స్వచ్ఛంద సంస్థ 'సేవ్ నిమిషా ప్రియా' పేరిట ప్రత్యేక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa