హీరోలు, రాజకీయ నాయకులు తెలుసంటూ, వారిని కలిపిస్తామని చెబుతూ అనేక మంది అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజడం మనం చాలా సినిమాల్లోనే చూశాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి మోసాలకే పాల్పడిందో జంట. ముఖ్యంగా ప్రధాని మోదీ కార్యదర్శి కుటుంబ సభ్యులుగా నటిస్తూ.. అనేక మందికి మాయ మాటలు చెప్పారు. అవి నిజమని నమ్మిన వాళ్లు వారి దగ్గరకు రాగా.. టెండర్లు ఇప్పిస్తామంటూ కోట్లు తీసుకున్నారు. ఇలా ఒకరిద్దరి వద్ద నుంచి కాదు అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు లాక్కున్నారు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భువనేశ్వర్‌కు చెందిన 38 ఏళ్ల హన్సితా అభిలిప్సా, అనిల్ మొహంతిలు భార్యాభర్తలు. అయితే వీరిద్దరూ భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనం అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అభిలిప్సా తాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా కూతురునని అందరితో చెప్పుకుంటుంది. ఆ విషయాలను అందరూ నమ్మేలా... అనేక మంది రాజకీయ ప్రముఖులతో కలిసి దిగినట్లుగా ఉన్న ఫొటోలను కార్యాలయంలో పెట్టుకునేది. అంతేకాకుండా వచ్చిన వారందరికీ ఆ ఫొటోలను చూపించేది. అలాగే ఆమె భర్త కూడా తాను మిశ్రా అల్లుడినంటూ మాయ మాటలు చెప్పేవాడు.
అయితే ఈ జంట మాటలు నమ్మిన వారు తమ కార్యాలయానికి వస్తే.. టెండర్లు ఇప్పిస్తామం, మీకెలాంటి పనులు కావాలన్నా చేసి పెడతాం అంటూ తెలిపేవారు. అయితే అందుకు డబ్బులు ఖర్చు అవుతాయంటూ కోట్లు గుంజేవారు. ముఖ్యంగా అభిలిప్సా మైనింగ్, నిర్మాణం, బహుళజాతి వ్యాపారాలు చేసే ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయాలు పెంచుకునేది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకునే కీల నిర్ణయాలను తాను మార్చగలనని.. తన మాటే అందరూ వింటారని నమ్మించేది. ఇలా అనేక మందిని మోసం చేసిన కోట్లు కొల్లగొట్టిన ఈ జంటపై డిసెంబర్ 26వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... అభిలిప్సా, ఆమె భర్త అనిల్ మొహంతిలు పీకే మిశ్రా కుటుంబానికి చెందిన వారు కాదని గుర్తించారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకే వారు అలా నటించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అలాగే కోట్లు కొల్లగొట్టిన ఆ కిలాడీలను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వీరి చేతిలో ఇంకెవరైనా మోసపోయి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ స్వరాజ్ దేబాటా ప్రజలకు సూచించారు.