బీజేపీ యువనేత, దేశంలోనే అత్యంత చిన్న వయసున్న ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. బెంగళూరు సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలిచిన తేజస్వీ.. చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ప్రకటించారు. మార్చి 24న తమ వివాహానికి ముహూర్తం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయోఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ... మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీ నుంచి సంస్కృతంలో ఎంఏ పూర్తి చేసిన శివశ్రీ.. ప్రముఖ గాయనిగా గుర్తింపు పొందారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శివ శ్రీకి.. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. పొన్నియన్ సెల్వన్-2లో కన్నడ వెర్షన్‌కు ఆమె గాత్రదానం చేశారు. ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అంతేకాదు, గతేడాది అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరాముడిపై కన్నడలో ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ పాట ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని కూడా ఆకర్షించింది. శివశ్రీ పాటకు ఫిదా అయిన మోదీ.. ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఇక, బెంగళూరులో జరిగే తేజస్వీ సూర్య, శివశ్రీల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యే అవకాశం ఉంది. తొలిసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తేజస్వీ సూర్య ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి.. విజయం సాధించారు. బీజేపీ తరఫున తరుచూ తన గళం వినిపించడంలో తేజస్వీ ముందుంటారు. అయితే,తరుచూ వివాదాలతోనూ వార్తల్లో ఉంటారు. డిసెంబరు 2022లో ఇండిగో విమానం ఎక్కిన ఆయన అత్యవసర ద్వారం తెరిచినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి. చెన్నై-తిరుచ్చి విమానంలో జరిగిన ఈ ఘటనను నాటి పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ధ్రువీకరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, అనుకోకుండా చేయి తగలడంతోనే డోర్ లాక్ తెరిచి.. పక్కకు జరిగిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa