మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న పెద్దపులిని మహారాష్ట్రలోని మాకుడి/అంతర్‌గామ్ పరిసరాల్లో పట్టుకున్నట్లు అటవీ అధికారులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట బెబ్బులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా దాని కదలికలను గమనించారు. ఈ క్రమంలో పులి బోనులో చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు దానికి మత్తు ఇచ్చి చంద్రపుర్‌కు తరలించారు.సరిహద్దు గ్రామాల్లో ఇద్దరిపై దాడి చేసి ఒకరి ప్రాణాలు తీసి మ్యాన్ ఈటర్‌గా మారిన పులిని ఎట్టకేలకు పట్టుకోవడంతో ఇటు అధికారులు.. అటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత నవంబర్ 29న కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో పత్తి చేనుల్లో పనిచేస్తున్న లక్ష్మిపై దాడిచేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు సిర్పూర్(టీ) సమీపంలోని పత్తిచేనులో పని చేసుకుంటున్న రైతు సురేశ్‌పై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు నెలల కాలంలో అక్కడక్కడ సంచరిస్తూ తరచూ పశువులపై దాడి చేసింది.