వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కబ్జా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భూకబ్జాలపై వెంటనే విచారణ చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. 52 ఎకరాల చుక్కల భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు కబ్జా చేశారనే ఆరోపణలు కొన్ని రోజులుగా గుప్పుమంటున్నాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చను లేవనెత్తింది. ఈ విషయం కాస్త, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి.. పేదలు, ప్రభుత్వ భూముల జోలికి ఎవ్వరూ వచ్చిన సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు విచారణకు ఆదేశించి కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఎటువంటి భూములను తాము ఆక్రమించలేదని సజ్జల బుకాయిస్తున్నారు.