రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్ ప్రభావతి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. మెడికల్ బోర్డు చైర్మన్‌గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించిన బోర్డులోని ఇతర వైద్యులిచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను నిర్దోషినని అనారోగ్యంతో ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా, బాధితుడైన రఘురామ తన న్యాయవాదులు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వీవీ లక్ష్మీ నారాయణ, కావూరి గోపీనాథ్ వాదనలు వినిపించారు. కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో డాక్టర్ ప్రభావతి భాగస్వామి అయ్యారని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆమె దురుద్దేశంతో ట్యాంపరింగ్ చేశారని పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని కోర్టును కోరారు. మరోవైపు, ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి మిగిలిన నిందితులతో కుమ్మక్కయ్యారని కోర్టుకు తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభావతికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.