ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనానికి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్కారును ఆదేశించింది. ఉపకులాల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదక సమర్పించేందుకు ఏకసభ్య కమిషన్ ఏ వివరాలు పరిగణనలోకి తీసుకుంటుందో ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదని పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కమిషన్ ఉపకులాల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక అందజేయకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలని, అపరిపక్వ దశలోనే పిటిషన్ వేశారని ఆక్షేపించింది. ఉపకులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం వద్ద వివరాలు లేవని పిటిషనర్ ఎలా చెబుతారని ప్రశ్నించింది. సాంఘిక సంక్షేమశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై పూర్తి వివరాలను తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన జీవో 91ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన పరసా సురేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు రాగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఏకసభ్య కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలయ్యాయన్నారు. ప్రస్తుత పిటిషన్ కూడా ఇదే వ్యవహారంతో ముడిపడి ఉందని.. మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఏకసభ్య కమిషన్ నియామకాన్ని తాము సవాల్ చేయడం లేదన్నారు. ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఇప్పటివరకు సమగ్ర అధ్యయనం జరగలేదని, ప్ర భుత్వం వద్ద ఎలాంటి వివరాలూ లేవని తెలిపారు.ఉపకులాల స్థితిగతులపై అధ్యయ నం జరిపిన తర్వాతే వర్గీకరణ విషయంలో ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా 2024లో కులాల సమాచారం సేకరించారని, అందులో ఉపకులాల సమాచారం లేదని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని జీవో 91లో పేర్కొన్నారని, వారి ద్వారా సేకరించిన సమాచారం చెల్లుబాటు కాదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వం వద్ద వివరాలు లేవని మీరెలా చెబుతారని ప్రశ్నించారు. అపరిపక్వ దశలో పిటిషన్ దాఖలు చేశారని.. ఏకసభ్య కమిషన్ ఉపకులాల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేయకుంటే కోర్టును ఆశ్రయించాలని, కమిషన్ ఏ వివరాలు పరిగణనలోకి తీసుకుంటుందో ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదని పేర్కొన్నారు.