అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ ట్రావెల్స్ కార్యాలయం వద్ద పార్కింగ్ చేసిన బస్సుల్లో ఒకటి గురువారం తెల్లవారుజామున దగ్ధమైంది. మరొకటి పాక్షికంగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ శాఖ అధికారులు, సిబ్బంది రెండు పైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న మరికొన్ని బస్సులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆర్‌ఎ్‌ఫఓ భూపాల్‌రెడ్డి తెలిపారు.షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆకతాయిలు రాత్రిళ్లు మద్యం సేవిస్తుంటారని, తాగి పడేసిన బీడీలు, సిగరెట్ల కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని కూడా భావిస్తున్నారు. త్రీటౌన్ ఎస్‌ఐ గోపాలుడు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కాగా.. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు దగ్ధం ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగనే మేలు.. నా బస్సులను నిలబెట్టించాడు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏకంగా బస్సులను తగలబెట్టించింది. మా బస్సులు కాలిపోయినా మాకు కేసు వద్దు. ఏం సుమోటో కేసు పెట్టుకోలేరా..? పెట్టకూడదా..?’ అని పోలీసులను ప్రశ్నించారు.