కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరుకు చెందిన చంద్రశేఖర్(25) పోలీస్ కావాలని కలలు కన్నాడు. ఈ మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అప్లై చేసి ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఈ మేరకు నేడు మచిలీపట్నంలో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. అయితే 1,600 మీటర్ల పరుగు పందెంలో చంద్రశేఖర్ పాల్గొనగా.. కాసేపటికే అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు.అక్కడే ఉన్న అంబులెన్స్ సిబ్బంది సైతం చంద్రశేఖర్ ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువకుడు స్పందించకపోవడంతో హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి ప్రాణాలు నిలిపేందుకు ఎంతో శ్రమించారు. అయినప్పటికీ చంద్రశేఖర్ మృతి చెందారు. దీంతో అక్కడంతా విషాద వాతావరణం చోటు చేసుకుంది. త్వరలో తమ కుమారుడికి పోలీసు ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులపై పిడుగు లాంటి వార్త పడింది. కుమారుడి మరణ వార్త విని గుండెలు పగిలేలా చంద్రశేఖర్ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.