అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో శుక్రవారం వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈరోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికీ ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు. పూజది కైంకర్యాలు ముగిసిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై ఆలయ తిరు విధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవ మూర్తులు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.