ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుండగా, మరో అల్పపీడనం ఉత్తర తమిళనాడుపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయువ్య దిశ వైపు కదులుతూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపు ప్రభావం చూపనుందని తెలిపింది. ఈనెల 11, 12వ తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో చలి మరింత పెరగవచ్చని చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో హిందూ మహాసముద్రం కూడా మరింత ప్రభావం చూపించే అవకాశాలున్నాయని చెప్పింది.ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్ అంచనాల ప్రకారం రోజంతా పొడి వాతావరణం ఉండటంతో మేఘాలు తక్కువగానే కనిపిస్తాయని తెలిపింది. మధ్యాహ్నం సమయంలో ఎండ అంతగా ఉండకపోవచ్చని చెప్పింది. ఇలా వాతావరణంలో కలిగే మార్పులతో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో చలిగాలి వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఏపీలో గంటకు 16 కిలోమీటర్లు.. తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో చలిగాలుల ప్రభావం ఉంటుందని చెప్పింది. దూరపు ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.