కేంద్ర ప్రభుత్వ కరువు బృందంతో సమావేశమై ఏపీలో కరువు పరిస్థితులను రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వివరించారు. ఏపీలో ఖరీఫ్-2024 కరువు పరిస్థితులపై కేంద్రప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఖరీఫ్ కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేస్తుందని తెలిపారు. నష్టపోయిన పంట వివరాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలని కోరారు. సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని అన్నారు. వ్యవసాయ శాఖ రూ. 90.62కోట్లు, రూరల్ వాటర్ సప్లై రూ. 0.78 కోట్లు, అర్బన్ వాటర్ సప్లై రూ. 4.89 కోట్లు, పశు సంవర్ధక శాఖ రూ.55.47 కోట్ల మేరకు ఆర్థిక సహాయం అవసరమని అన్నారు.ఐదు జిల్లాల్లో 27 తీవ్ర కరువు మండలాలు, 27 మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తించినట్లు వివరించారు. అన్నమయ్య - 19, చిత్తూరు - 16, శ్రీ సత్య సాయి - 10, అనంతపురం - 7 కర్నూలు – 2 మండలాలను గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ చర్యలను చేపట్టిందని చెప్పారు. రూ.16.67 కోట్ల వ్యయంతో సుమారు లక్ష మంది రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.55.47 కోట్ల వ్యయంతో పశుగ్రాసం, పశుగ్రాస విత్తనాల సరఫరా, 60శాతం సబ్సిడీపై TMR (Total Mixed Ratio), 40శాతం సబ్సిడీపై చాఫ్ కటర్లు, మందుల సరఫరా చేస్తున్నట్లు సీఎస్ ఆర్పీ సిసోడియా తెలిపారు.