ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 07:32 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ర్టిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త వినిపించింది. విద్యుత్ వాహనాలు (ఎలక్ట్రిక్ వాహనాలు) కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి పూర్తి పన్ను రాయితీ అందిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సస్టైనబుల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ 4.0 అమల్లో ఉన్నంత కాలం విద్యుత్ వాహనాలకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే హైబ్రిడ్‌ నాలుగు చక్రాల వాహనాలకు మాత్రం ఈ నిర్ణయం వర్తించదని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీ చేశారు.


పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పన్ను రాయితీ కల్పిస్తున్నారు. ఈ మేరకు రోడ్ ట్యాక్స్ రాయితీ ఇస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ కూటమి సర్కారు అనేక పాలసీలు తీసుకువచ్చింది. క్రీడా పాలసీ, నూతన ఇసుక పాలసీ, లిక్కర్ పాలసీ ఇలా అనేక విధానాలను అమల్లోకి తెచ్చారు.


ఈ క్రమంలోనే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చింది. ఈ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ అమలులో ఉన్నంత కాలం ఎలక్ట్రిక్ వాహనాలను మోటారు వాహన పన్ను మినహాయింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఉన్న వాహనాలకు మాత్రమే పన్ను రాయితీ ఉంటుందని.. హైబ్రిడ్ నాలుగు చక్రాల వాహనాలకు మాత్రం వర్తించదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.


మరోవైపు పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధన వనరుల వాడకం ద్వారా వాతావరణ కాలుష్యంతో పాటుగా ఇంధనాల కొరత తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే ప్రజలను పర్యావరణ అనుకూలమైన జీవన విధానానికి మారాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రాయితీలు అందిస్తున్నారు. ఈ రాయితీల ద్వారా ఈవీల వాడకం పెరుగుతుందని.. దీంతో కర్బన ఉద్గారాల తగ్గుదలతో పాటు ప్రజలకు ఆర్థికంగా కూడా కలిసొస్తుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com