తిరుపతి తొక్కిసలాట జరిగి మూడు రోజులైనా బాధ్యులపై ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆర్కె రోజా ఆక్షేపించారు. ఇటువంటి దుర్ఘటన జరిగినా ఇంకా కూటమి ప్రభుత్వంలోని సీఎం, డిప్యూటీ సీఎంలకు బుద్దిరాలేదని మండిపడ్డారు. న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరి క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి ఆర్కె రోజా శనివారం మీడియాతో మాట్లాడుతూ.... తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటనలో తొలి ముద్దాయిగా సీఎం చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనంకు లక్షలాధి మంది భక్తులు వస్తారు, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని తెలిసి కూడా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు సీఎం చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన కోసం చిత్తూరు, తిరుపతి పోలీస్ బలగాలను, అధికార యంత్రాంగాన్ని మోహరింప చేసుకోవడం వల్లే తిరుపతిలో భక్తుల భద్రతను ఎవరూ పట్టించుకోలేదు. సంఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా చంద్రబాబు ఇంకా తమ సొంత మనుషులను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబుకు శ్రీవారి భక్తులన్నా, హిందువులన్నా ఏ మాత్రం గౌరవం లేదు. వారి ప్రాణాలకు విలువ లేదు. చంద్రబాబు తనకు రోజూ భజన చేసే బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ గా, తన గత ఓఎస్డీని అడిషనల్ ఈఓగా తన సెక్యూరిటీ ఆఫీసర్ సుబ్బారాయుడిని తిరుపతి ఎస్పీగా నియమించుకున్నారు. వీరెవరూ స్వామి వారికి సేవ చేసిన వారు కాదు, చంద్రబాబుకు సేవ చేసిన వారు, ఇప్పుడు కూడా ఆయన కోసమే పనిచేస్తున్న వారు. తన టీంను కాపాడుకోవడమే చంద్రబాబుకు ముఖ్యం అని వాపోయారు.