ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించి గుండెని కాపాడే అలవాట్లు, ప్రతి ఉదయం పాటిస్తే చాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 11:33 PM

ఈ రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన అలవాట్లు, కాలుష్యం, ఏది పడితే అది తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. హై కొలెస్ట్రాల్‌ సమస్యని డైస్లిపిడెమియా అని కూడా అంటారు. కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కొవ్వు. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తుంది. కొలెస్ట్రాల్ ప్రధానంగా ఆహారం నుంచి ఉత్పత్తి అవుతుంది. కాలేయం కొంత కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్), హై డెన్సిటీ లిపోప్రొటీన్).అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మనకు చాలా మంచిది. దీనిని మంచి కొలెస్ట్రాల్ అంటారు.


తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మన ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్త ధమనుల్లో పేరుకుపోతుంది. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గి.. చెడు కొవ్వు పెరిగితే దానిని హై కొలెస్ట్రాల్ అంటారు. అయితే, ఉదయాన్నే కొన్ని అలవాట్లు పాటిస్తే కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ప్రమాదాలు


చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యను లైట్ తీసుకుంటారు. అయితే, ఇది పెద్ద సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ మన రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఒక్కోసారి ఇది గుండె పోటుకు కారణమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు ఆరోగ్యానికి మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరలు కుంచించుకుపోవడం వల్ల శరీరంలో అనేక భాగాల్లో నొప్పి వస్తుంది. దీంతో.. పాదాల నొప్పులు వస్తాయి. అయితే, ఉదయాన్నే కొన్ని అలవాట్లతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.


గోరువెచ్చని నీటితో నిమ్మకాయ


ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో తాజా నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు మీ జీర్ణవ్యవస్థను సక్రియం చేయడమే కాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ సైన్స్‌లోని ఒక నివేదిక ప్రకారం , నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సాయపడుతుంది. దీంతో, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా సాయపడుతుంది.


బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్


బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఓట్స్, క్వినోవా వంటి ఫుడ్స్‌ని అల్పాహారంలో భాగం చేసుకోవాలి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయి. ఓట్స్ తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఓట్స్‌‌తో పాటు పండ్లు, గింజలు, కూరగాయలు వంటి వాటిని డైట్‌లో తీసుకోవడం అలవాటు చేసుకోండి.


వ్యాయామం


కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి ఉదయం వ్యాయామం చేయడం బెస్ట్ ఆప్షన్ నిపుణులు అంటున్నారు. చురుకైన నడక, యోగా, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామం చేయడం కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి గొప్ప మార్గం. శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా మెరగవుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆనందాన్ని పెంచి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక కారణం.


నట్స్, గింజలు


​వాల్‌నట్స్, బాదం పప్పు వంటి నట్స్‌లో పోషకాలు ఉన్నాయి. ఈ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సాయపడతాయి. అలాగే, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచుతాయి. అందుకే ఈ గింజల్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. వాల్‌నట్‌లు, బాదంపప్పులు రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్రతి ఉదయం 1 చేతి వాల్నట్ మరియు బాదంపప్పులను తినడం మంచి మార్గం.


గ్రీన్ టీ


1136 మంది వ్యక్తులపై నిర్వహించిన 14 ట్రయల్స్‌లో.. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ప్రజల కొలెస్ట్రాల్ స్థాయిలు 7.20 mg/dl తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుంచి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా, రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కాల్చేస్తాయి. ఇక దీన్ని రోజూ ఉదయాన్నే తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.


ఒత్తిడిని తగ్గించుకోండి


ఒక నివేదిక ప్రకారం , ఒత్తిడి సమస్యలు ఉన్నవారిలో అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి సమయంలో, కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీని కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించుకోవాలంటే మొదట ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందుకోసం ధ్యానం, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోండి. ఈ అలవాట్లు మీ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఉదయం పదినిమిషాల పాటు ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి కంట్రోల్‌లో ఉంటుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com