ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన సెర్చింగ్ ఆపరేషన్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సెర్చింగ్ నిర్వహిస్తున్న వేళ మావోయిస్టులు ఎదురుపడి భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు, వారిని నిలువరించేందుకు చేపట్టిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.
బీజాపూర్ జిల్లాలోని మద్దేడు పోలీసు స్టేషన్ పరిధిలో బందిపొరా-కోరెన్‌జోడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇరువైపుల ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరుగుతున్న ప్రాంతం నుంచి మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధ సంపత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాతో పాటు నారాయణపూర్ జిల్లాలో కూడా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు భారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా ఈ నెల 6వ తేదీన మావోయిస్టుల కోసం గాలిస్తున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ ఘోర ఘటనలో 8 మంది సైనికులు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ మధ్యకాలంలో మావోయిస్టుల కోసం సెర్చింగ్ లో భద్రతా బలగాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలో కూంబింగ్ ఆపరేషన్లను విరివిగా నిర్వహిస్తున్నారు.
దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేదంటే వారిని సమూలంగా నిర్మూలించేదుకు ఆపరేషన్ చేపడతామని అమిత్ షా హెచ్చరించారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారని, కానీ మోదీ వారి ఆటలు సాగనివ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నాయని, త్వరలోనే ఆయా జిల్లాల్లోనూ మావోయిస్టులను అంతం చేస్తామని షా అన్నారు.