చదువుకునే రోజుల్లో కొత్త మంది పరీక్షల్లో ఎలాగైనా ఉత్తీర్ణత సాధించాలని, మరికొందకు ఎక్కువ మొత్తంలో మార్కులు రావాలని సులువుగా కాపీ కొట్టేస్తుంటారు. కానీ ఉద్యోగ పరీక్షల్లో మాత్రం అలాంటి పనులు చేసేందుకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆలోచించకుండా ముందడుగు వేశాడు. బాగా చదివి సంపాదించాల్సిన ఉద్యోగాన్ని చీటింగ్ చేసైనా సరే దక్కించుకోవాలనుకున్నాడు. ఏకంగా పోలీస్ ఉద్యోగ పరీక్షల్లోనే సాంకేతికత సాయంతో కాపీ కొట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని జల్నా జిల్లా భోకర్డాన్‌కు చెందిన 22 ఏళ్ల కుష్నా దల్వి చాలా రోజులుగా పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉద్యోగం సంపాదించాలనే కసి ఎక్కువగానే ఉన్నా చదువు మాత్రం చేతకాలేదు. అందుకే తన కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకున్న అతడు చీటింగ్ చేసైనా సరే ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. ఈక్రమంలోనే శనివారం రోజు ముంబయి ఓషివారాలోని రాయ్‌గఢ్ మిలిటరీలో నిర్వహించిన డ్రైవర్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు.
అయితే ఇందులో ఎలాగైనా ఉత్తీర్ణత సాధించాలని నిర్ణయించుకున్న అతడు చీటింగ్ కోసం మంచి ప్లానే వేశాడు. చెవిలో ఓ మైక్రో ఇయర్ పీస్ పెట్టుకుని.. దాన్ని ఫోన్‌కు కనెక్ట్ చేశాడు. దూరంగా ఉన్న తన ఇద్దరు స్నేహితుల ద్వారా అతను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పించుకున్నాడు. ఇలా వారి సాయంతో పరీక్ష రాస్తున్న కుష్నాను ఇన్విజిలేటర్లు ముందుగా గుర్తించలేకపోయారు. చెవి లోపలి భాగంలో పెట్టుకోవడంతోనే వాళ్లు కనిపెట్టలేదు. కానీ పరీక్ష రాస్తున్నప్పుడు అతడి ప్రవర్తను గుర్తించిన ఇన్విజిలేటర్లు.. అతడిని పరీక్షంగా చెవిలో ఏదో ఉన్నట్లు గుర్తించారు.
ముఖ్యంగా కుష్నా ఎడమ చెవిలో ఉన్న మైక్రో ఇయర్ పీస్ బయటకు తీసి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆపై కుష్నాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి ద్వారానే చాటుగా ఉండి తనకు సమాధానాలు చెబుతున్న అతడి ఇద్దరు స్నేహితుల వివరాలను కనుక్కున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసి కుష్నాను అరెస్ట్ చేశారు. అలాగే అతడి వద్ద నుంచి మైక్రో ఇయర్ పీస్, సిమ్‌కార్డ్, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.