ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడా ప్రధాని పదవిపై భారత సంతతి మహిళ అనితా ఆనంద్ కీలక ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 08:41 PM

ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని రేసులో ఉన్న మొదటి ఐదుగురిలో ప్రస్తుత రవాణా మంత్రి, భారత సంతతి మహిళా ఎంపీ అనితా ఇందిరా ఆనంద్‌ పేరు కూడా ఉంది. తాజాగా, అనిత కీలక ప్రకటన చేశారు. కెనడా ప్రధాని రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు ఎక్స్ (ట్విట్టర్)‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఓక్‌విల్లే ఎంపీగా అనిత.. తాను మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. కానీ, వచ్చే ఎన్నికల వరకు ఉన్న తన బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.


పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ టీమ్‌లో తనకు అవకాశం ఇచ్చినందుకు.. .కీలక శాఖలను అప్పగించినందుకు ట్రూడోకు, తనను ఎన్నుకున్నందుకు ఓక్‌విల్లే ప్రజలకు అనిత కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలని అనుకుంటున్నట్టు అనిత తెలిపారు.


‘‘దేశానికి, సమాజానికి మనం అనేక విధాలుగా సేవ చేయవచ్చు. కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచడానికి ఓ ప్రజా ప్రతినిధిగా నేను చేయాల్సినవన్నీ చేశాను.. .నేను పుట్టడానికి ముందే కెనడాకు వలస వచ్చిన నా తల్లిదండ్రులు.. ఈ దేశ గొప్పదనం.. మాకు అందించిన సహకారాన్ని చెబుతూ పెంచారు. కాబట్టి మా లిబరల్ పార్టీ కోసం, ఓక్‌విల్లే కోసం..అన్నింటికి మించి కెనడా కోసం నేను ఇక్కడ ఉంటాను’’ అని అనిత చెప్పారు. తాను మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు భారత సంతతి మహిళ గెలవలేదని ప్రచారం చేశారు. కానీ, అక్కడి ప్రజలు మాత్రం తనను ఒకటి కాదు రెండుస్లారు గెలిపించారని చెప్పారు. దీనిని ఎంతో గౌరవంగా భావించి.. జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు.


ట్రూడో వారసుడ్ని నాయకుడిని ఎన్నుకునే పనిలో లిబరల్ పార్టీ నిమగ్నమైంది. ఈక్రమంలో ప్రధాని రేసులో ఆ పార్టీకి చెందిన క్రిస్టినా ఫ్రీలాండ్‌, మార్క్‌ కార్నీ, డొమినిక్‌ లీ బ్లాంక్‌, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్‌ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌తో పాటు భారత సంతతికి చెందిన అనిత ఆనంద్‌, జార్జ్‌ చాహల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే అక్టోబరులో కెనడా పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు పలు సర్వేలు, పోల్స్ సూచిస్తున్నాయి. మరో 9 నెలలే సమయం ఉండటం, ప్రభుత్వం వ్యతిరేకతతో ప్రధాని పదవిని చేపట్టడానికి వీళ్లు ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది.


తమిళ్‌, పంజాబీ మూలాలున్న అనితా ఆనంద్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్య పూర్తిచేశారు. 2019లో మొదటిసారి ఓక్‌విల్లే నుంచి ఎంపీగా గెలిచారు. ఆ వెంటనే ట్రూడో క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2019- 2021 మధ్య ప్రజాసేవల శాఖ, ఆ తర్వాత రెండేళ్లు రక్షణ శాఖ, గత డిసెంబరులో రవాణా శాఖ బాధ్యతలు స్వీకరించారు. అనితా ఆనంద్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌కు కెనడా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. గత నెలలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు. అనిత తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజీషియన్‌, తల్లి పంజాబ్‌కు చెందినవారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com