కూటమి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. అభివృద్ధికి ఆనవాళ్లుగా నిలుస్తాయి. ప్రతి రోడ్డూ సిమెంట్ రోడ్డుగా మారుతుంది. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి విడతగా రూ.4,500 కోట్లు కేటాయించాం. అని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్నారని, భారీగా నిధులు తెస్తున్నారని ఆయన తెలిపారు. పరిటాల పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వైసీపీ అరాచక పాలన వల్ల గాడి తప్పిన వ్యవస్థల్ని ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు సరిదిద్దారని, వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలిపారు. పరిటాలకు రైల్వేస్టేషన్, లాజిస్టిక్ హబ్ మంజూరైందని, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల రోడ్డుగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. జిల్లాలో 523 గోకులం షెడ్ల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించినట్టు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎన్‌ఎస్పీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కోగంటి బాబు, ఆర్డీవో బాలకృష్ణ, పశుసంవర్ధకశాఖ జేడీ హనుమంతరావు, డీపీఎం లావణ్యకుమారి, డీఎంహెచ్‌వో సుహాసిని, డ్వామా పీడీ రాము పాల్గొన్నారు.