గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు వివరించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 26న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రిపబ్లిక్ డే పరేడ్ చీఫ్ కో-ఆర్డినేటర్ సంబంధిత విభాగాల సంస్థల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులు పాల్గొంటారని, ఇందుకు మినిట్ టు మినిట్‌ను అనుసరించి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుచర్యలు తీసుకొంటామన్నారు. ప్రధాన వేదికను ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించి, స్టేడియంలో పోర్ట్ వాల్ డిజైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకొంటామన్నారు. పోలీసు కమిషనర్ పి.రాజశేఖరబాబు మాట్లాడుతూ, వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసే వీఐపీ వాహనాలకు ప్రత్యేక ప్రాక్సిమేట్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల రిహార్సల్స్ నిర్వహించాలని, ఫుల్‌డ్రస్ రిహార్సల్స్‌తో పరేడ్‌ను సిద్ధం చేస్తామన్నారు. వీవీఐపీ, వీఐపీలు ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకొంటామన్నారు. వేడుకల్లో ఆర్మీ కంటెంజెంట్ రాష్ట్ర పోలీసు బెటాలియన్స్, ఎన్‌సీసీ స్కౌట్ అండ్ గైడ్స్, పోలీసు బ్యాండ్ వంటి విభాగాలు కవాతులో పాల్గొంటారన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు వివరించారు.