పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జియ్యమ్మవలస మండలం అల్లువాడకు చెందిన లోలుగు రాంబాబు (45), అతని పెద్ద కుమారుడు మోక్షశ్రీహాన్ (5) దుర్మరణం చెందారు. ఈ ఘటనలో రాంబాబు భార్య ఉమామహేశ్వరి, చిన్న కుమారుడు సూర్యశ్రీహాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాంబాబు బాడంగి మండలంలోని 108 వాహనంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)గా గత పదేళ్ల నుంచి పనిచేస్తు న్నాడు. భార్య ఉమ పాచిపెంట మండలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరు తమ ఇద్దరు కుమారులతో కలిసి విజయ నగరం జిల్లా రామభద్రపురంలో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 13న భోగి నాడు రాంబాబు తన భార్యా పిల్లల తో కలిసి స్వగ్రామం అల్లువాడ వచ్చా డు. అక్కడ తన తల్లిదండ్రు లు లోలుగు అప్పలనాయుడు, అప్పమ్మ, తమ్ముడు మన్మథరావుతో కలిసి సంక్రాంతి జరుపుకున్నాడు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తన భార్యా పిల్లలతో కలిసి రామభద్రపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మరో ముప్పావు గంటలో ఇంటికి చేరుతారు అనుకునేలాలోగా పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో రాంబాబు, అతని పెద్ద కుమారుడు మోక్షశ్రీహాన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్య ఉమ, చిన్న కుమారుడు సూర్యశ్రీహన్‌ను అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోవిందరావు తెలిపారు.