మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఆ క్రమంలో తన వివాహ వేడుకకు బంధుమిత్రులను ఆహ్వాంచాలని నిర్ణయించాడు. అందులోభాగంగా శుభలేఖలు ఇచ్చి.. వారిని స్వయంగా ఆహ్వానించేందుకు బయలుదేరాడు. అలా వెళ్లిన అతడిని మృత్యువు.. అగ్నిప్రమాదం రూపంలో కబళించింది. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? గ్రేటర్ నోయిడాలోని నవాడాకు చెందిన అనిల్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 14వ తేదీ అతడి వివాహం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం.. అంటే జనవరి 18వ తేదీ అతడు ఆహ్వాన పత్రికలు తీసుకొని బంధుమిత్రులను ఆహ్వానించేందుకు బయలుదేరాడు. ఆ క్రమంలో ఘాజీపూర్ బాబా బోకే హాల్ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో దాదాపుగా అగ్నికి ఆహుతి అయిన అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం.. ప్రభుత్వాసుపత్రికి తరలించారు.