తిరుమలలో జరుగుతున్న ఘటనలపై వైసీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాపప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిస్తే ఎందుకు రద్దు చేయించారని ప్రశ్నించారు. విజయవాడకు వచ్చిన అమిత్ షాతో హడావిడిగా కేంద్రం బృందం పర్యటన రద్దు చేయించారని ఆరోపించారు. కూటమి పాలనలో టీటీడీ పరువు పోయిందన్న భూమన.. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయన్నారు. తిరుమలలో బాలుడు చనిపోయాడని.. బిర్యానీ పొట్లాలు, మద్యం కూడా కొండపై దొరికాయని భూమన చెప్పారు. చంద్రబాబు పాపాలపుట్ట కొండగా మారిందన్న భూమన కరుణాకర్ రెడ్డి.. వెంకన్న స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.ఇక టీటీడీ ఛైర్మన్ టీడీపీ నేతల సేవలో తరిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ నాలుగుసార్లు దొరికారని..సనాతన ధర్మం కాపాడతానంటున్న పవన్ కళ్యాణ్ శాఖలోనే ఇవన్నీ జరుగుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరపతి లడ్డూ వ్యవహారంలో వైసీపీపై బురద జల్లాలని చూశారని.. అయితే న్యాయ విచారణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు అక్షర మాయతో తమపై బురద జల్లాలని ప్రయత్నిస్తేవిష్ణు మాయ ముందు భష్మం కాక తప్పదంటూ భూమన హెచ్చరించారు.