పిల్లలు అన్నాక అల్లరి చేయడం మామూలే. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల అల్లరిని కట్టడి చేయడానికి ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే మరీ తిట్టడం, కొట్టడం వరకు వెళుతుంటారు. అయితే, ఇలా తిట్టడం, కొట్టడం వల్ల పిల్లల ప్రవర్తనలో కొన్ని రకాల మార్పులు వస్తాయని పిల్లల మానసిక నిపుణులు చెబుతున్నారు. అత్యంత కఠినం (స్ట్రిక్ట్)గా వ్యవహరించే వారి పిల్లల్లో ప్రమాదకరమైన ప్రవర్తన అలవడుతుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలపై తీవ్ర ఒత్తిడి, కఠినంగా వ్యవహరిండం వల్ల ఈ కింది లక్షణాలు ఏర్పడుతాయని సూచిస్తున్నారు.పిల్లల పట్ల తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటే... పిల్లల్లో మూడ్ స్వింగ్స్ సమస్య తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేకపోతారని. ఉన్నట్టుండి కోపగించుకోవడం, గట్టిగా అరవడం వంటి లక్షణాలు పెరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు.తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తే వారికి భయపడి అన్ని విషయాలను దాచిపెట్టే అలవాటు పెంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు. మంచి అయినా, చెడు అయినా ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులుగా మారతారని స్పష్టం చేస్తున్నారు.పిల్లలపై తీవ్రంగా ఒత్తిడి పెడితే, రూల్స్ పెడుతూ ఉంటే ఎదురుతిరగడం, ఎదురు ప్రశ్నించడం మొదలవుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. తమ జీవితంపై పెత్తనం ఏమిటనే స్థాయికి ఇది చేరవచ్చని హెచ్చరిస్తున్నారు.తల్లిదండ్రుల కఠిన ప్రవర్తన వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పిల్లలను తరచూ తిట్టడం, చెప్పినట్టు వినడం లేదని, ఆశించినట్టుగా చదవడం లేదని అతిగా ఒత్తిడి చేయడం మంచిది కాదని స్పష్టం ఏవైనా చిన్న తప్పులు చేసినా తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించడం వల్ల పిల్లలు తీవ్ర మానసిక ఆందోళనకు (యాంగ్జైటీ)కి లోనవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరంగా పరిణమిస్తుందని పేర్కొంటున్నారు.తల్లిదండ్రుల కఠిన ప్రవర్తన వల్ల పిల్లలు ఎవరితోనూ కలవక, ఒంటరితనాన్ని ఇష్టపడేవారిగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు. స్నేహితులనూ దూరం చేసుకుంటారని, భవిష్యత్తులో ఇంట్రావర్టులుగా మారతారని హెచ్చరిస్తున్నారు. తరచూ ఇది చేయలేదు, అది చేయలేదు, సరిగా చదవడం లేదంటూ తీవ్రంగా ఒత్తిడి చేసే తల్లిదండ్రుల వల్ల పిల్లల్లో మోటివేషన్ లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ప్రోత్సాహం కరవై దేనిపైనా దృష్టిపెట్టక వెనుకబడిపోతుంటారని హెచ్చరిస్తున్నారు.