ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండ్లు చూపించి రూ.15 కోట్లు కొట్టేశారు.. అలా ఎలా నమ్మారు సామీ..!

Crime |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2025, 08:51 PM

మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు పుడుతూనే ఉంటారు. మోసపోయేవారి బలహీనతే.. మోసం చేసేవారికి బలం. మనిషి అత్యాశే పెట్టుబడిగా కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వారిని ఈజీగా బుట్టలో వేసుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలంటూ చీట్ చేస్తున్నారు. తాజాగా.. జనగామ జిల్లాలో పండ్లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు చూపించి రూ. 15 కోట్లు కొట్టేశారు. యాప్‌లో వాటిని కొనుగోలు చేస్తే డబుల్ ఆదాయం అంటూ నిండా ముంచారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.


ఘటన వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్కు చెందినదిగి చెబుతున్న 'కోస్టా వెల్‌ గ్రోన్‌' యాప్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ జనగామ జిల్లాలో కేటుగాళ్లు ప్రచారం చేశారు. స్థానికంగా ఉండే కొందర్ని ఏజెంట్లుగా నియమించుకొని యాప్‌లో పెట్టుబడులు పెట్టించారు. మొదటగా రూ.570 కట్టి యాప్‌లో మెంబర్‌షిప్ చేయిస్తారు. ఆ తర్వాత తర్వాత 40 రోజుల పాటు ప్రతిరోజు రూ. 37 చొప్పున వాలెట్‌లో డిపాజిట్‌ చేయిస్తారు. ఈ లెక్కన వారు పెట్టిన రూ.570కి మొత్తం రూ.1,480 ఆదాయం వచ్చినట్లు నమ్మిస్తారు. ఇలా ప్రతిరోజూ ఆదాయం వస్తుందని.. ఎక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం అని ప్రచారం చేశారు.


రూ.97 వేలు పెట్టుబడిగా పెట్టి కోస్టా వెల్ గ్రోన్ యాప్‌లో ఓ పండు కొంటే 58 రోజుల పాటు ప్రతీరోజు రూ.5,141 చొప్పున వాలెట్‌లో జమ అవుతాయని నమ్మించారు. పెట్టింది రూ.97 వేలు అయితే మెుత్తం 58 రోజుల తర్వాత రూ.2,98,178 ఆదాయం వస్తుందని చెప్పారు. ఇలా రూ. 1000 నుంచి రూ. 7 లక్షల వరకు పండ్లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు యాప్‌లో (కొన్న పండ్లు ఇంటికి రావు.. జస్ట్ పెట్టుబడి మాత్రమే) కొనుగోలు చేయవచ్చునని అన్నారు. మెుదట్లో లాభాలు రావటంతో జనగామ పట్టణంలోని చాలా మంది ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. శివారు పాటు శివారు గ్రామాలకు చెందిన దాదాపు 2 వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని పెట్టుబడులు పెట్టారు. ఇందులో రోజూవారీ కూలీలతో పాటుగా.. బాగా చదువుకున్న విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. మెుత్తంగా రూ.15 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు.


అయితే మెుదట్లో లాభాలు పంచిన యాప్ నిర్వహకులు సంక్రాంతి ముందు షాక్‌ ఇచ్చారు. యాప్‌లో డౌన్‌లోడ్‌, పెట్టుబడులకు సంబంధించిన ఆప్షన్లు పనిచేస్తున్నా.. వచ్చిన లాభం డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన బాధితులు లోకల్‌ ఏజెంట్లను నిలదీశారు. పండగ తర్వాత విత్ డ్రా చేసుకునే ఆప్షన్ పని చేస్తుందని వారు చెప్పటంతో నిజమని నమ్మారు. రోజులు గడుస్తున్నా.. డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోటవంతో ఏజెంట్లను సంప్రదించాలని చూడగా.. వారు అందుబాటులోకి రావటం లేదు. ఫోన్లు చేసినా.. ఎత్తటం లేదు. దీంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కష్టపడకుండా డబ్బులు ఊరికే రావని.. తక్కువ సమయంలోనే ఎవరూ ఎక్కువ మెుత్తంలో డబ్బులు ఇవ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. యాప్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో ఉన్నత విద్యావంతులు ఉండటం కలవరపాటుకు గురి చేస్తుందని అంటున్నారు. పండ్లు కొంటే లాభాలు వస్తాయని చెబితే ఎలా నమ్మారంటూ పోలీసులు బాధితులను ప్రశ్నిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com