క్రమశిక్షణా కమిటీ ముందుకు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. సోమవారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కొలికపూడి వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. కొలికపూడి వివరణ అనంతరం క్రమశిక్షణ కమిటీ ఆ నివేదికను సీఎం చంద్రబాబుకు పంపనున్నారు. కాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆ పార్టీ నాయకత్వం తాఖీదు జారీ చేసింది. సోమవారం పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈనెల 11న తన నియోజకవర్గంలోని ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో ఒక అంతర్గత రహదారి విషయంలో కొన్ని గిరిజన కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆ వివాదంలో జోక్యం చేసుకొని ఓ వ్యక్తిపై చేయి చేసుకొన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.