శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. పదిరోజుల పాటు టీటీడీ అధికారులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ పది రోజుల్లో దాదాపు 6 లక్షల 83 వేల 304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని.. ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను తెరిచిన విషయం తెలిసిందే. గతేడాది తరహాలోనే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. చివరిగా ఆదివారం అర్ధరాత్రి ఏకాంతసేవతో వైకుంఠ ద్వారాలను మూసివేశారు. ఇక సోమవారం నుంచి యధావిధిగా శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి రావడంతో టీటీడీ అధికారులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు.కాగా ఆదివారం చివరి రోజు కావడంతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలి వచ్చారు. కేవలం దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు, టికెట్లను కూడా టీటీడీ అధికారులు జారీ చేశారు. గత తొమ్మిది రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలకు సంబంధించి 50వేల టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. అలాగే ఆన్‌లైన్‌లో 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది.