ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమిత్ షా పై మండిపడ్డ షర్మిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2025, 03:30 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా  గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది అని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. YCP  పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా ? ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా ? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ? ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా ?  సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు ? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా ? 5 ఏళ్లపాటు జగన్ గారు  మీకు దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. రాష్ట్రంలో సహజ వనరులను 'మోదానీ'కి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ గారు అయితే... కర్మ, క్రియ బీజేపీ  ప్రభుత్వమే. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం. రూ.3లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం.  అమిత్ షా గారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మీ వ్యాఖ్యలు మీద మీరు కట్టుబడి ఉంటే.. మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి అని డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com