ఏపీలో మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. యువగళం పేరిట పాదయాత్ర చేపట్టి.. పార్టీని అధికారంలోకి తేవడంలో లోకేశ్ కృషి చేశారని, అన్ని విధాలా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడని టీడీపీ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై హోంమంత్రి అనిత స్పందించారు. సింహాచలంలో పర్యటిస్తున్న హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. "అంతా దైవేచ్ఛ. నుదిటిపై రాసి ఉన్నది ఎవరూ తీయలేరు. లోకేశ్‌కు రాసిపెట్టి ఉందేమో చూద్దాం. నాకైనా, లోకేశ్‌కైనా దేవుడు ఆశీర్వదిస్తేనే పదవులు వస్తాయి. మాతో పాటు అందరూ దేవుడిని కోరుకుంటే ఎలాంటి పదవులైనా వస్తాయి" అని అన్నారు. ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడం మంచి పరిణామం అని హోంమంత్రి పేర్కొన్నారు.