పరందూరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులకు తమిళ హీరో, తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) పార్టీ అధినేత విజయ్ మద్దతు పలికారు. ఇవాళ నిరసనలు తెలుపుతున్న రైతుల శిబిరాన్ని సందర్శించిన విజయ్... వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి రైతులే వెన్నెముక అని అన్నారు. ఈ పోరాటంలో తమ పార్టీ చివరి వరకు రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తన క్షేత్రస్థాయి రాజకీయాలకు ఈ రైతుల ధర్నా నుంచే నాంది పలుకుతున్నానని విజయ్ పేర్కొన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అలాగని ఎయిర్ పోర్టును కూడా వద్దనడంలేదని, అయితే, సారవంతమైన సాగుభూమిలో ఎయిర్ పోర్టు నిర్మించడం సబబు కాదని అన్నారు. ఎయిర్ పోర్టు నిర్మించేందుకు ఎంచుకున్న ప్రదేశమే సమస్యగా ఉందని, మరో చోట ఎయిర్ పోర్టు నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని వివరించారు