నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ త్వరలోనే శ్రీకారంచుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల(పీఎంసీ) నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయ టవర్లలో నీటి తోడివేత తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పీఎంసీలను నియమించనుంది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కీలక పనులు చేపట్టేందుకు ఈ పీఎంసీలు అంచనాలు రూపొందించనున్నాయి. వాటి ప్రకారం టెండర్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశాక క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ కూడా పీఎంసీలే నిర్వహించాల్సి ఉంటుంది.మరో రూ.11 వేల కోట్ల పనులకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో రాజధానిలో అత్యంత ప్రధానమైన సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మిగిలి ఉంది. ఇవి భారీ ప్రాజెక్టులు కావటంతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల(పీఎంసీ)ను నియమించనున్నారు. ఈ పీఎంసీలు ఆయా పనులను పర్యవేక్షించడంతోపాటు అంచనాలను కూడా రూపొందించనున్నాయి. ఈ నియామకాలు పూర్తికాగానే సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు కూడా టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.