ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్.. భారతీయులపై ప్రభావం ఎంత?

national |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2025, 07:58 PM

అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ఆ దేశంలో ఉంటున్న విదేశీయులకు గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అమెరికాలో పుట్టిన ప్రతీ వ్యక్తికి లభించే.. జన్మతః పౌరసత్వంను రద్దు చేస్తూ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అక్కడ ఉంటున్న విదేశీయులు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో అధికంగా భారతీయులు కూడా ఉండటంతో.. అసలు ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. 150 ఏళ్లకు పైగా అమెరికాలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి ట్రంప్ నిలిపేశారు. ఇక నుంచి అమెరికాలో అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు వచ్చే జన్మతః పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు.


అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు మాత్రమే కాకుండా.. అమెరికాలో ఉన్న ప్రతీ జంటకు పుట్టిన ప్రతీ ఒక్కరికీ అమెరికా పౌరసత్వం వస్తుంది. అమెరికాలో పుట్టిన ప్రతీ ఒక్కరు ఈ దేశపౌరులే అనే ఉద్దేశంతో 1868లో రాజ్యాంగ సవరణ చేశారు. దీని ప్రకారం అమెరికాకు శరణార్థులుగా వచ్చిన వారి పిల్లలకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తోంది. అయితే తాజాగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ విధానానికి అడ్డుకట్టపడింది. అమెరికాలో ఒక బిడ్డ పుట్టే సమయానికి.. వారి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా.. ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా ఆ పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదని తాజా ఉత్తర్వులు చెబుతున్నాయి. అంతేకాకుండా తండ్రి అమెరికాలో శాశ్వత నివాసి అయినప్పటికీ.. తల్లి తాత్కాలిక వీసా మీద నివసిస్తున్నా.. వారికి పౌరసత్వం లభించదని పేర్కొంటున్నారు.


ప్రవాస భారతీయులపై ప్రభావం


ప్రతీ సంవత్సరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2024 చివరి నాటికి అమెరికాలో 54 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉంటున్నారు. ఇక అమెరికా మొత్తం జనాభాలో భారతీయుల సంఖ్య సుమారు 1.47 శాతం. వీరిలో 34 శాతం మంది అమెరికాలో పుట్టినవారు కాగా.. మిగిలిన వారంతా వలసవచ్చిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి.. అక్కడ గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్న వారికి పుట్టిన పిల్లలు ఎవరికీ అమెరికా పౌరసత్వం లభించదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


అమెరికాలో భారతీయ జంటలకు పుట్టిన పిల్లలకు ఇప్పటివరకు వచ్చినట్లు పుట్టుకతోనే పౌరసత్వం రాదు. మరోవైపు.. ఇప్పటికే గ్రీన్‌ కార్డు రాక తీవ్ర ఇబ్బందిపడుతున్న భారతీయ వలసదారులు.. వారి పిల్లలకు పౌరసత్వం రాకపోతే.. గ్రీన్‌ కార్డు జారీ మరింత ఆలస్యం కానుంది. అమెరికాలో జన్మించిన వారికి పుట్టుకతో పౌరసత్వం రాకపోతే.. వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకుస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. దీనివల్ల వారి తల్లిదండ్రులు భారత్‌లో.. పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది.


తాజా నిర్ణయంతో బర్త్ టూరిజం ఆగిపోనుంది. చాలా మంది భారతీయ మహిళలు డెలివరీ సమయానికి అమెరికాకు వెళ్లి.. అక్కడ బిడ్డకు జన్మనిస్తే పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుంది. దీన్నే బర్త్‌ టూరిజం అంటారు. మరోవైపు.. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ స్టూడెంట్స్‌కు పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. అమెరికాలోని భారత విద్యార్థులు ఇతర దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటారు. ఇక నుంచి వారి పిల్లలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2011లో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఒకవేళ పుట్టుకతో పౌరసత్వాన్ని నిలిపివేస్తే దాని ప్రభావం అందరిపైనా ఉంటుంది. ఇక అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు అమెరికాకు చెందిన వారే అని నిరూపించుకోవాల్సి ఉంటుంది.


అయితే ఈ నిర్ణయం అమలు చేయాలంటే చాలా పెద్ద ప్రక్రియే ఉంటుంది. దీని కోసం అమెరికా రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ పుట్టుకతో వచ్చే పౌరసత్వం విధానాన్ని రద్దు చేస్తే ట్రంప్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్‌, సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కానుంది. ఇక రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడొంతుల మంది ఆ నిర్ణయానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక కొత్త సెనేట్‌లో డెమొక్రాట్‌లకు 47 స్థానాలు ఉండగా.. రిపబ్లికన్లకు 53 సీట్ల బలం ఉంది. మరోవైపు.. హౌస్‌లో డెమొక్రాట్లకు 215 స్థానాలు.. రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com