పోలీస్ ఉద్యోగం సాధించాలనేది ఎంతో మంది యువతీ, యువకుల కల. అందుకోసం పట్టు వదలకుండా ఎంతో శ్రమిస్తుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ప్రభుత్వ కొలువుతో కన్నవారి కల నెలవేర్చాలని అనుకుంటారు. అందుకు ఈవెంట్స్ కోసం శరీరాన్ని సైతం ఉక్కుకడ్డీలా మార్చేందుకు నిరంతరం కష్టపడతారు. అయితే ఇలాగే కలగన్న ఓ యువకుడు మాత్రం చివరికి కటకటాల పాలయ్యాడు. అదేంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలు సైతం నిర్వహించింది. అందులో క్వాలిఫై అయిన వారికి డిసెంబర్ 20 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే కర్నూలు జిల్లా కోసిగి మండలం దొడ్డి బెళగల్‌కు చెందిన తిరుమల అనే యువకుడు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఈ మేరకు నిన్న(మంగళవారం) దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. అతని ఎత్తు, ఛాతీ కొలతలు సరిపోకపోవడంతో అధికారులు ఆ యువకుడిని వెనక్కి పంపారు. అయితే తాను కొలతల్లో క్వాలిఫై అయినట్లు ఆ యువకుడు ఫేక్ హాల్ టికెట్ సృష్టించాడు. అనంతరం దాన్ని తీసుకుని 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడు.స్టార్టింగ్ పాయింట్ డ్యూటీలో ఉన్న రిజర్వు ఇన్‌స్పెక్టర్ నాగభూషణం యువకుడి మోసాన్ని గుర్తించారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎస్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్‌లో అభ్యర్థి పేరును పరిశీలించారు. అయితే తిరుమల పేరు లేకపోవడంతో ఫేక్ హాల్ టికెట్ సృష్టించి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో విషయాన్ని వెంటనే ఎస్పీ బింధుమాధవి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులనే మోసం చేయాలనుకున్న సదరు యువకుడిపై ఎస్పీ ఆగ్రహించారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసిన రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.