ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దీంతో నిధుల అక్రమాలపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం, క్రమశిక్షణ రాహిత్యానికి సంజయ్ పాల్పడ్డారని అభియోగాలు వచ్చాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ట్యాబ్‌ల కొనుగోళ్లు, అగ్ని మొబైల్ యాప్‌ను జేబు సంస్థలకు కట్టబెట్టారని, అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్‌పై ఆరోపణలు రావడంతో.. ఈ మేరకు అతనిపై డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు ఇచ్చారు. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యం తదితర అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. నెలరోజుల్లోగా అభియోగాలపై వివరణ ఇవ్వాలని సంజయ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అధికార దుర్వినియోగం, క్రమశిక్షణా రాహిత్యంపై విచారణ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే విచారణ సందర్భంగా రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొద్దని సంజయ్‌కు హెచ్చరిక జారీ చేసింది. నిధుల దుర్వినియోగం సహా నమోదైన వేర్వేరు అభియోగాలపై ఇప్పటికే సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.మరోవైపు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలంటూ సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.