ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామస్థులు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోక్షం కలగడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. గతంలో రాళ్లు తేలిపోయి కనీసం నడిచి వెళ్లడానికి కూడా ఇబ్బందిపడేవారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ రోడ్డు పనులు.. నిధులు కొరతతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గతుకుల రోడ్డు పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ రహదారి ముఖ చిత్రం మారిపోయింది. వివరాల్లోకి వెళితే..గారమండల పరిధిలోని వమరవల్లి పంచాయతీ హకుంపేట గ్రామానికి ప్రధాన రహదారి నుంచి సుమారు 1200 మీటర్లు పొడవునా పూర్థిగా శిథిలమైన రోడ్డు ఉంది. ఈ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నారు. అటు కళింగపట్నం, ఇటు శ్రీకాకుళం వెళ్లాలంటే ఈ రోడ్డుగుండానే పో వాల్సి ఉంటుంది. దీంతో వారంతా రాకపోక లకు తీవ్రంగా ఇ బ్బందిపడేవారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం రూ.1.10 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు అందకపోవడంతో ఆ పనులు ఆపేసి వెళ్లిపోయారు. అటు తర్వాత గత ప్రభుత్వం ఈ రోడ్డు పనులు పూర్తి చేయకుండా నాన్‌ప్రయార్టీ కింద వదిలేసింది. దీంతో రాళ్లు తేలిపోయి గోతులు ఏర్పడి కనీసం రాకపోకలు కూడా చేయలేక ఇబ్బందిపడ్డారు.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోడ్డు దుస్థితిని ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి ఆ గ్రామస్థులు, పెద్దలు తీసుకురావడంతో ఆయన స్పందించారు. తక్షణమే ఈ రోడ్డు అభివృద్ధికి ఉపాధి పథకం ద్వారా రూ.64.50 లక్షలు నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేయించారు. ఇటీవల ఈ రోడ్డు పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీంతో ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు అష్టకష్టాలు పడిన ఆ గ్రామస్థులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.