ఉద్దానంలో కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్ల ప్రభావంతో కొబ్బరి పంట దిగుబడి తగ్గుతోంది. మార్కెట్‌లో కొబ్బరికాయల ధర పెరిగినా.. అందుకు తగ్గ దిగుబడులు లేక తమకు నష్టాలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంగా పిలిచే కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల 32వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. ఒకప్పుడు రైతులకు ఇవే ప్రధాన ఆదాయ వనరులుగా నిలిచేవి. 2018లో తితలీ తుఫాన్ దెబ్బకు కొబ్బరి పంట తుడిచిపెట్టుకుపోయింది. వేలాది చెట్లు నేలకొరిగాయి. అనంతరం చీడపీడలు సోకి.. పంట నామరూపమే మార్చేసింది. ఇప్పటికీ ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పంట కోలుకోలేదు. గత రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో కొబ్బరిచెట్ల నుంచి దిగుబడి తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు ఎకరాకు రెండు నెలల వ్యవధిలో 500 కాయల వరకు దిగుబడి రాగా.. ప్రస్తుతం వంద కాయలు కూడా రాని పరిస్థితి నెలకొంది. అలాగే కంచిలి, కవిటి ప్రాంతాల్లో నల్లముట్టి, తెల్లదోమ తెగుళ్లు ఉధృతమయ్యాయి. తెగుళ్లతో పాటు కొమ్ముపురుగు, కాండంతొలుచు పురుగులు ఆశించి నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయి. దీంతో కొబ్బరి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. చెట్టు నుంచి కాయలు దించేందుకు అవసరమయ్యే కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయం కొంతమంది కొంతమంది అరకొర ఆదాయంతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో అప్పులపాలవుతున్నారు. మరికొంతమంది ఉపాధి కోసం వలసబాట పడుతున్నారు. ఇంకొందరు తమ తోటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు తోటలు చదును చేసి వెంచర్లు వేసి.. ప్లాట్లు విక్రయిస్తున్నారు. దీంతో కొబ్బరిసాగు కూడా తగ్గుముఖం పడుతోంది.