అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ (U19 Womens T20 WC)లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ (Team India) 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (49; 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 58 పరుగులకే పరిమితమైంది. లంక టాప్-5 బ్యాటర్లలో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఆరో స్థానంలో వచ్చిన రష్మిక సెవ్వండి (15) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో షబ్నమ్ 2, జోషిత 2, పరుణికా సిసోధియా 2, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
భారత బ్యాటర్లలో ఓపెనర్ త్రిష మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. కెప్టెన్ నిక్కి ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), జోషిత (14) రన్స్ చేశారు. కమలిని (5), భవికా (7), ఆయుషి (5) నిరాశపర్చారు. లంక బౌలర్లలో ప్రముది, ఏసేని తలగునె, లిమాన్స తిలకరత్న రెండేసి వికెట్లు పడగొట్టగా.. రష్మిక, చామోడి ప్రభోద, మనుడి నానయక్కర ఒక్కో వికెట్ తీశారు.