సమస్యల పరిష్కారం కోసం ఆశ్రయించే బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రతీ ఒక్క పోలీసు అధికారి విధులు నిర్వహించాలని శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. ‘జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో ‘మీ కోసం’ వేదికగా సమస్యలను తెలిపేందుకు బాధితులు తరుచూ వస్తున్నారు. ఇకపై ఇటువంటి ఫిర్యాదులు నా దృష్టికి వస్తే ఉపేక్షించేది లేద’ని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ‘జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి. సైబర్ నేరాల అడ్డుకట్టకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పేకాట నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిపై బైండోవర్ కేసులు పెట్టాల’ని ఎస్పీ ఆదేశించారు. ఇటీవల మెళియాపుట్టి - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పేకాట నిర్వాహణ, శ్రీకాకుళంలో రూ.11 లక్షలతో పేకాట రాయుళ్లు పట్టుబడటం వంటి విషయాలపై చర్చించారు. జైలు నుంచి విడుదలైన నేరస్థులు, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తుల నడవడికపై నిఘా ఉంచాలన్నారు. విజబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పలు కేసుల్లో ప్రతిభ చూపిన సీఐలు పైడపునాయుడు, ప్రసాదరావు, సత్యనారాయణతో పాటు పలువురు పోలీసు అధికారులను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డీఎస్ ఆర్వీఎస్‌ఎన్ మూర్తి, ప్రసాదరావు, ఎస్సైలు పాల్గొన్నారు.