రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టించాడని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్ట్ డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లుగానే జనవరి నెలలోనే డయా ఫ్రం వాల్ పనులు మొదలుపెట్టాంమని గుర్తు చేశారు. అదేవిధంగా డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు సగం పూర్తి కాగానే, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభిస్తామని అన్నారు. గతంలో 18 నెలలు కష్టపడి చంద్రబాబు డయా ఫ్రం వాల్ నిర్మిస్తే.. గత ప్రభుత్వం బాధ్యతా రహిత్యంత ధ్వసం చేసిందని ఆరోపించారు.
జగన్ తుగ్లక్ పాలనతో పోలవరం ప్రాజెక్ట్ మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కామెంట్ చేశార. కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణంతో ప్రభుత్వంపై మరో రూ.వేయ్యి కోట్ల అదనపు భారం పడిందని అన్నారు. ఏడేళ్ల క్రితం పోలవరం నిర్వాసితులకు రూ.800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే.. మళ్లీ నేడు మరో రూ.వెయ్యి కోట్లు పరిహారం అందించారని తెలిపారు. 2019 ఎన్నికల ముందు పోలవరం నిర్వాసితులకు అదనంగా 10 లక్షల పరిహారం అందిస్తానని చెప్పి గెలిచాక జగన్ మొహం చాటేశాడని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి రూ.12,159 కోట్ల నిధులు తీసుకొచ్చామని అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు.