ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11.440 కోట్లతో ప్యాకేజి ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ప్యాకేజీని స్వాగతిస్తుండగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడం, సొంతంగా ఉక్కు గనులు కేటాయించడమే దీర్ఘకాలిక పరిష్కారం అవుతుందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికిప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ విలీనానికి సెయిల్ అభ్యంతరం చెబుతోందని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కు ప్రస్తుతం ప్యాకేజీ ప్రకటించారని, కాబట్టి స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిన తర్వాతే విలీనం గురించి ఆలోచిస్తామని సెయిల్ స్పష్టం చేసిందని వివరించారు. అంతేతప్ప, స్టీల్ ప్లాంట్ ను ఎప్పటికీ విలీనం చేసుకునేది లేదని సెయిల్ ఎక్కడా చెప్పలేదని, దీనిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. "సెయిల్ చెబుతున్నది ఇదే. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి మీరు ప్యాకేజీ ఇవ్వండి... మేనేజ్ మెంట్ మాకు అప్పగించండి అని సెయిల్ చెబుతోంది. మీరిచ్చిన ప్యాకేజితో మేం మేనేజ్ మెంట్ చేసి ఆ ఉక్కు కర్మాగారాన్ని ఒక సక్రమ మార్గంలోకి తీసుకువచ్చేందుకు, నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నం చేస్తాం... నష్టాల నుంచి బయటికి తీసుకువచ్చాకే విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేసుకునే ప్రక్రియ గురించి ఆలోచిస్తాం... అంతే తప్ప ఉన్నపళంగా ఫ్యాక్టరీని విలీనం చేసుకోలేం... అందుకు కొంత సమయం పడుతుంది అని సెయిల్ చెబుతోంది" అని శ్రీనివాసవర్మ వివరించారు. దీన్నిబట్టి, విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేసుకోవడంపై సెయిల్ సిద్ధంగానే ఉందని అర్థమవుతోందని, విలీనం చేసుకోవడంలేదనే మాట వాస్తవం కాదని స్పష్టం చేశారు